వెన్నెలా.. వెన్నెలా.. మెల్లగా రావే… కిందనున్న రైలుకన్నా పరుగులో..బుర్రనిండ నిండివున్న ఆలోచనలకు తోడై.. మెల్లగా రావే… గుర్తుకొచ్చే సిరివెన్నెల పాటవై.. ఎగిరొచ్చే రెక్కల పల్లకిపై..ఆగని సమయమై, సాగిన పయనమై.. మెల్లగా రావే… చల్లని గాలికి అమ్మ లాలిలా.. దరి చేరుతున్న నిద్దురని..కన్నులే మరిచేలా.. మెల్లగా రావే. వచ్చి ఉండిపోవే.. వెన్నెలా.. ఓ వెన్నెలా.. మెల్లగా రావే !
అమ్మ ఏడ్చింది నేను ఈ ప్రపంచాన్ని చూడకముందే, నాన్న ఆనందంలో నన్ను చూసుకుని అమ్మ ఏడ్చింది. నేను తలకిందులై జన్మించే ఆ క్షణాలలో నా క్షేమం కోరుకుంటూ, తను బాధ పడుతూ అమ్మ ఏడ్చింది. పెరుగుతున్న నన్ను, తన కలలని, కంటిపాపలా కాపాడుతూ, ఆ కంటికే తెలీయకుండ అమ్మ ఏడ్చింది. అల్లరి చిల్లరిగా ఆటలాడుతూ దెబ్బతగిలించుకున్న నేను ఏడ్వటం చూడలేక అమ్మ ఏడ్చింది. తప్పు ద్రోవలో వెళ్ళానని తెలిసి ఆవేశంగా నన్ను కొట్టినా, అమ్మా ఏడ్చింది. చదువులకీ,…